అమిత్ షా మణిపూర్కు పోవాల్సింది..అమిత్ షాపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

అమిత్ షా మణిపూర్కు పోవాల్సింది..అమిత్ షాపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ కు కాకుండా నిత్యం అల్లర్లు జరుగుతున్న మణిపూర్ పోతే బాగుండేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అమిత్​ షా ఎన్నిసార్లు హైదరాబాద్ కు  వచ్చినా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేంద్రంలో బీజేపీనే పర్మనెంట్ గా అధికారంలో ఉంటుందని అమిత్ షా అంటున్నారు, సర్ ను అడ్డం పెట్టుకొని పర్మినెంట్ గా ఉండాలని చూస్తున్నారా?’ అని ప్రశ్నించారు.

తొలగించిన 13 కోట్ల 30 లక్షల ఓట్లలో 3 కోట్ల మంది అక్రమంగా ఉంటున్నవారేనని అంటున్నారని, మరి ఆ 3 కోట్ల మంది అక్రమంగా దేశంలోకి చొరబడుతుంటే కేంద్రం ఏం చేస్తున్నదని మండిపడ్డారు. దేశం లోపలికి ఎంతమంది విద్రోహ శక్తులు వచ్చాయి? దేశంలో అంతర్గత భద్రత పరిస్థితి ఏంటి? 12 ఏండ్ల నుంచి బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి ఎంత మంది అక్రమంగా దేశంలోకి చొరబడ్డారు? అనే ప్రశ్నలకు అమిత్​ షా సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.